ఆ సీన్‌లో నటించింది ఎన్టీఆర్ కాదని ప్రేక్షకులు గుర్తించారు. అయినా సినిమా సూపర్‌హిట్ అయింది!
on Oct 29, 2024
1949లో నటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఎన్.టి.రామారావు 1964 వరకు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. 1964లో విడుదలైన ‘రాముడు భీముడు’ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు ఎన్టీఆర్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన తొలి సినిమా ఇదే. వరసగా 9 ఫ్లాప్ సినిమాలు తీసిన తాపీ చాణక్యను డైరెక్టర్‌గా ఎంపిక చేసుకొని ఈ సినిమా చేయడం ఆరోజుల్లో గొప్ప సాహసంగా చెప్పుకున్నారు. రూ.6.40 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే ఘనవిజయాన్ని అందుకున్నారు రామానాయుడు. ఇప్పుడు డూయల్ రోల్‌ని చిత్రీకరించడం టెక్నికల్‌గా కష్టమైన విషయం కాదు. కానీ, ఆరోజుల్లో అంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని టెక్నిక్స్ ద్వారా రెండు పాత్రలను చూపించేవారు. రెండో నటుడికి మాస్క్ వెయ్యడం ద్వారానో లేదా హీరోకి దగ్గరి పోలికలు ఉన్న నటుడ్ని లాంగ్ షాట్‌లో చూపించడం ద్వారానో సన్నివేశాల్ని చిత్రీకరించేవారు. మరికొన్ని సందర్భాల్లో రెండు పాత్రలకు సంబంధించిన సీన్స్‌ని చిత్రీకరించి ఒకే ఫ్రేమ్‌లో మిక్స్ చేసేవారు. అలాంటి సన్నివేశాలు తెరపై ఈజీగా తెలిసిపోయేవి.
‘రాముడు భీముడు’ విషయానికి వస్తే సినిమాలోని చాలా సన్నివేశాల్లో ఇద్దరు ఎన్టీఆర్‌లు కలుసుకునే సందర్భాలు ఉంటాయి. వాటన్నింటినీ పర్‌ఫెక్ట్‌గా చిత్రీకరించారు దర్శకుడు చాణక్య. కానీ, క్లైమాక్స్‌లో మరోసారి ఇద్దరూ కనిపించాల్సిన అవసరం వచ్చింది. కానీ, ఆ సమయంలో ఎన్టీఆర్ ఇతర సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఎంత ప్రయత్నించినా కాల్‌షీట్స్ సర్దలేకపోయారు. ఆయన ఫ్రీ అయ్యే వరకు ఆగే పరిస్థితి యూనిట్‌కి లేదు. దాంతో ఎన్టీఆర్‌ని రిక్వెస్ట్ చేశారు రామానాయుడు. ఎంతో కష్టం మీద ఒక సినిమాకి కేటాయించిన కాల్‌షీట్స్‌లో ఒక పూట మాత్రం ఇవ్వగలనని, షూటింగ్‌కి ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. ఒక్క పూటలో ఆ సీన్ ఎలా తియ్యాలి అనే విషయంలో దర్శకుడు చాణక్య, నిర్మాత రామానాయుడు చాలా టెన్షన్ పడ్డారు. రెండు పాత్రలూ ఒకే ఫ్రేమ్‌లో రావాలంటే వేరే నటుడికి మాస్క్ వేసి స్ప్లిట్ విధానంలో చెయ్యాలి. అలా చెయ్యడానికి ఒక్కరోజు కూడా సరిపోదు.
అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌కి దగ్గరి పోలికలు ఉన్న కైకాల సత్యనారాయణను పిలిపించారు. ఎన్టీఆర్ ఇచ్చిన కాల్‌షీట్ ప్రకారం ఒక్కపూటలోనే క్లైమాక్స్‌లోని ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. అయితే రెండో ఎన్టీఆర్ ఒరిజినల్ కాదని, సత్యనారాయణ అని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. కనిపించింది కొన్ని క్షణాలే అయినా ప్రతి ప్రేక్షకుడూ దాన్ని గుర్తించారు. ఈ విషయం గురించి అప్పట్లో పాత్రికేయులతోపాటు చాలామంది రామానాయుడుని అడిగారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా షూటింగ్ జరిగిందని, క్లైమాక్స్‌లోని సన్నివేశం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెయ్యవలసి వచ్చిందని రామానాయుడు చెప్పారు. అయితే సినిమా ఘనవిజయం సాధించడంతో ఈ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఆ సీన్‌లో సత్యనారాయణ కనిపించినప్పటికీ అది సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. అది మొదలుకొని ఎన్.టి.రామారావు ఏ సినిమాలో డూయల్ రోల్ చేసినా అందులోని కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు సత్యనారాయణనే పిలిపించేవారు. అయితే ఎన్టీఆర్‌కి డూప్‌గా సత్యనారాయణ నటించాడని ఎవరూ గుర్తించకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు.
Also Read